అన్నింటికీ ఆధారం  జనగణన!..నియోజకవర్గాల డీలిమిటేషన్‌‌, మహిళా రిజర్వేషన్లు, పాలసీలకు ఈ లెక్కలే కీలకం

అన్నింటికీ ఆధారం  జనగణన!..నియోజకవర్గాల డీలిమిటేషన్‌‌, మహిళా రిజర్వేషన్లు, పాలసీలకు ఈ లెక్కలే కీలకం
  • తొలిసారిగా డిజిటల్ విధానంలో డేటా సేకరణ 
  • రాష్ట్రంలో 90 వేల మంది సిబ్బందికి శిక్షణ.. 33 రకాల ప్రశ్నలతో సర్వే 
  • బీసీ కుల గణన, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోటా ఖరారుకు ఈ డేటానే ప్రామాణికం

హైదరాబాద్, వెలుగు: దాదాపు 16 ఏండ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన ప్రక్రియ రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానుంది. నియోజకవర్గాల డీలిమిటేషన్ (పునర్విభజన), చట్ట సభల్లో రిజర్వేషన్ల ఖరారు, నూతన ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు ఈ తాజా లెక్కలే ఆధారం కానున్నాయి. దీంతో ఈ డేటా సేకరణను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌‌గా తీసుకున్నది.

అయితే, సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఈ డేటాను ప్రామాణికంగా తీసుకోబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ కింద ఇండ్ల జాబితా తయారీ, గృహాల వివరాల నమోదు ప్రక్రియను అత్యంత శాస్త్రీయంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ (కమర్షియల్), ఇన్‌‌స్టిట్యూషన్ల వారీగా వేర్వేరుగా గృహాలను గుర్తించి నమోదు చేస్తారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 వేల మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు ఇప్పటికే ట్రైనింగ్ ప్రారంభించారు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో ఎన్యుమరేటర్లు తమ మొబైల్ ఫోన్లలోని ప్రత్యేక యాప్ లేదా పోర్టల్ ద్వారా సమాచారాన్ని అక్కడికక్కడే పొందుపరుస్తారు. అంతేకాకుండా ప్రజలే స్వయంగా ఆన్‌‌లైన్‌‌లో తమ వివరాలను నమోదు చేసుకునే (సెల్ఫ్ -ఎన్యుమరేషన్) వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. 

అన్నింటికీ ఆధారం ఈ జన గణన..

దేశ, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్ (పునర్విభజన) ప్రక్రియకు ఈ తాజా జనగణన గణాంకాలే కీలకం కానున్నాయి. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు, నిధులు కూడా ముడిపడి ఉన్నందున డేటా సేకరణలో ఏమరపాటుగా ఉండొద్దని, కచ్చితమైన సమాచారాన్నే తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్‌‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడానికి లేదా వాటి భౌగోళిక సరిహద్దులను మార్చడానికి ఈ లెక్కలనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రామాణికంగా తీసుకుంటుంది. చట్టసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’అమలు కూడా ఈ లెక్కల ఆధారంగా జరిగే డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే సాకారం కానుంది.

ఇక ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల జనాభా శాతాన్ని ఈ సెన్సస్ ద్వారా తేల్చితే, స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ దాకా ఆయా వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్ల కోటాను ఖరారు చేస్తారు. అదే సమయంలో ఈసారి బీసీలకు సంబంధించిన కుల లెక్కలు నమోదు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తు కోసం రూపొందించే దీర్ఘకాలిక పాలసీలకు కూడా ఈ సెన్సస్ నివేదికే దిక్సూచిలా పనిచేయనుంది.

సంపదను పంపిణీ చేయడంలో, రాష్ట్రాలకు పన్నుల వాటాను కేటాయించడంలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ జనాభా దామాషాను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటుంది. పట్టణీకరణ పెరుగుతున్న తీరు, గ్రామాల నుంచి నగరాలకు వలసల సరళిని ఈ లెక్కల ద్వారా విశ్లేషించి, భవిష్యత్ స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వాలు రచిస్తాయి.

అందుకే ఈ జనగణన కేవలం పౌరులను లెక్కపెట్టే సాధారణ ప్రక్రియ కాదని, రాబోయే దశాబ్దాల పాటు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని శాసించే విధానపరమైన డాక్యుమెంట్ అని సెన్సస్​ రాష్ట్ర డైరెక్టర్​ భారతి హోళికేరి ‘వెలుగు’కు వివరించారు. 

ఏం తింటున్నారు ? ఏ ఇంట్లో ఉంటున్నరు.. 

జనగణనలో భాగంగా ప్రతి ఇంటి యజమానిని అడిగి తెలుసుకోవాల్సిన 33 రకాల ప్రశ్నలతో కూడిన సమగ్ర ఫార్మాట్‌‌ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ప్రశ్నావళికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సైతం ఆమోదించింది. దీనిని రాష్ట్ర గెజిట్ జారీ చేయనున్నారు. 2011 సెన్సస్‌‌లో ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఈసారి మరిన్ని కలిపారు.

ఇంటి నిర్మాణ వస్తువుల (మెటీరియల్) గురించిన వివరాలు.. నేల, గోడలు, పైకప్పు అని విడివిడిగా మూడు ప్రశ్నలుగా మార్చారు. ఆహారపు అలవాట్లలో భాగంగా ఆ కుటుంబంలో ఎక్కువగా వాడే ప్రధాన ఆహార ధాన్యం (బియ్యం, గోధుమలు లేదా చిరుధాన్యాలు) గురించి అడుగుతారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎంతవరకు జరిగిందో తెలుసుకునేందుకు కుటుంబంలో ఎవరికైనా కనీసం ఒక బ్యాంక్ ఖాతా ఉందా అని రికార్డు చేస్తారు. ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు దాపరికం లేకుండా వాస్తవ సమాచారాన్ని వెల్లడించాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలిచ్చే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. 


తాగే నీళ్లపైనా ఆరా తీస్తరు..

ప్రధాన తాగు నీటి వనరుగా నల్లా, బోరు, బావి లేక ఇతర మార్గాలను ఆశ్రయిస్తున్నారా అనేది ఆరా తీస్తారు. ఆ తాగునీరు ఇంటి లోపలే అందుబాటులో ఉందా లేదా బయట నుంచి తెచ్చుకుంటున్నారా అనే విషయాన్ని కూడా నమోదు చేస్తారు. వంట కోసం ప్రధానంగా వాడే ఇంధనం (ఎల్పీజీ, కట్టెలు, కిరోసిన్, కరెంటు) వివరాలను సైతం జాతీయ డేటాబేస్ కోసం సేకరిస్తారు.

మరుగుదొడ్డి సౌకర్యం ఉందా లేదా (ఉంటే ఏ రకం), స్నానాల గది ఇంటి లోపలే ఉందా లేదా అని విచారిస్తారు. మురుగునీటి పారుదల సౌకర్యం ఓపెన్ డ్రైనేజీ ద్వారా సాగుతోందా, క్లోజ్డ్ డ్రైనేజీ ఉందా అనే పారిశుధ్య వివరాలను కూడా యాప్‌‌లో పొందుపరుస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులను కచ్చితంగా మదింపు చేయడానికి కుటుంబం వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల వివరాలనూ ఎన్యుమరేషన్ జాబితాలో చేర్చారు.